Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page

''మతైక్యం కావాలి, ఏకమతం కాదు''

లోకంలో పసివాళ్ళందరిదీ ఒకటేమతం. కల్లా కపటం ఎరుగక స్ఫటికంవలె స్వచ్ఛంగావుండేవాళ్ళ మనస్సులకు మత భేదాలంటూ లేవు. అంతలో కళ్ళవెంట నీళ్ళు పెట్టుకుంటూ అంతలో కలకలనవ్వుతూ ఉండటమే కాని, వాళ్ళ మనస్సులకు ఇంకా సుఖదుఃఖాల మాలిన్యం అంటుకోలేదు కనుకనేవాళ్లు ఈశ్వరస్వరూపులు. ఈశ్వర విగ్రహాన్ని చూడగానే 'హరహరా' అంటూచిట్టిచేతులతో చెంపలు వాయించుకోడమే వాళ్ళెరిగిన మతం. సరళాతిసరళ##మైన ఆ మతంలో సంశయాలకు తావులేదు. మనం గూడా పదిమందిమీ ఒక్కసారి గొంతు విప్పి ''హరోహర'' అన్నంతనేమనోభారమిట్టే తీరిపోయినట్లుంటుంది. ''హరోహర'' అనే ఈ నామోచ్చారణం పసివాళ్ళవలె మహాత్ములు కూడా చేస్తూవుంటారు. భక్త్యావేశంతో, ''గోవిందా, గోవిందా'' అని మన మరచినట్లే పిల్లలూ అరుస్తువుంటారు.

శివరాత్రి, శ్రీ జయంతి ఈరెండూ మనకు ముఖ్యమైన పండుగలు. ఈ రెండూ ఆరునెలలు ఎడముగా వస్తూవుంటవి. ఈ రెండు పండుగలకూ రాత్రులుజాగరంకోసం పిల్లలింటింటికి పగటివేళతిరిగి, ''శివరాత్రిమెంబారం'' 'శ్రీజయంతి మెంబారం' అంటూ కేకలు వేస్తూ నూనె పోగుచేస్తారు. వాళ్ళ పసి మనస్సులు శివ కేశవులమధ్య భేదం చెయ్యవు. అవ్వయ్యార్‌ అనే కవయిత్రికూడా ఇలాగే ''శివుని మరవకురా! కేశవుని సేవింపరా'' అంటూ శివకేశవుల నొక్కరీతిగా భజించినది.

పిల్లలు, భక్తులు ఒక్క చోట చేరినపుడు ''హరహర మహాదేవ. గోవిందా గోవిందా'' అంటూ వారి కంఠములు పండుగ వేళలందు వినిపిస్తవి. శివకేశవులనే నామములు, రూపములు వారి కొక్కటే. వారి పెదవులా నామములను ఉచ్చరించేటపుడు వారి హృదయాలలో మెదిలే దేవు డొక్కడే. శ్రీ శంకరులు భజగోవింద స్తోత్రము చేసిరి సంబంధార్‌ అనే భక్తుడున్నూ హరనామం చేయుమని బోధించారు. మన కిట్లు ఉపదేశించేనాటికి వీ రిరువురకూ బాల్యమే.

అజ్ఞానంధకారానికీ ఆవలనుండేనిత్యానందాన్ని పొందాలంటే పార్వతీసమేతుడైన ఈశ్వరుని ధ్యానించవలసిందని కైవల్యోపనిషత్తు ఉపదేశిస్తున్నది. సోమస్కందమూర్తిలో ఉమామహేశ్వరులేకాక, వారి బిడ్డడైన స్కందుడుకూడా దర్శనమిస్తాడు. స్కందుడు జ్ఞానమూర్తి. ఉమామహేశ్వరులది అభిన్నమైన ఏకమూర్తి. ''ఉమ్మచ్చి'' అనే పసిపిల్లలతొక్కు పల్కులు ఈ పరమార్థాన్ని బోధిస్తవి. ''ఉమ్మచ్చి'' అనగా ఉమాశివులు. విష్ణుమూర్తినికూడ పిల్లలు ఉమ్మచ్చి అనే అంటారు. కనుక శివ కేశవభేదంవారికిపట్టదన్నమాట. పిల్లలలో కన్పించే ఈ యేకేశ్వరభావమే మన సకలమత సమత్వానికి తార్కాణం పిల్లలవలె నిజమయిన ఆస్తికులు మతభేదాలను, ఈశ్వరనామ భేదాలను పట్టించుకోరు.

ఈశ్వరుని గూర్చిన ఈ యద్వయభావం ఇతర మతము లందు కన్పించదు. గాంధీజీ ''ఈశ్వరఅల్లా తేరేనాం'' అంటూ కీర్తించేవారు. భగవంతుణ్ణి. నేటిరోజుల్లో మతసహనం అంటూవుంటారు. అది కేవలం రాజకీయం. లోకమందిన్ని మతాలు పుట్టని కాలమందే శ్రీకృష్ణభగవానుడు-

యో యో యాంయాం తనుంభక్తః శ్రద్ధయార్చితు మిచ్ఛతి |

తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం ||

''ఈశ్వరుని ఏవరెవరు ఏ యే రూపాలతో భక్తితో కొలుస్తూ ఉంటారో ఆరూపమందే వారి భక్తిని నేను దృఢతరం చేస్తాను'' అని సెలవిచ్చారు.

ఈ సర్వమతసమత్వమునే బోధిస్తున్న ఈ శ్లోకం వినండి-

యం శైవా స్సముపాసతే శివ ఇతి, బ్రహ్మేతి వేదాంతినః

బౌద్ధా బుద్ధ ఇతి ప్రమాణ పటవః కర్తేతి నైయ్యాయికాః

అర్హన్నిత్యథ జైన శాసనరతాః కర్మేతి మీమాంసకాః

సోయంవో నిదధాతువాంఛిత ఫలంత్రైలోక్యనాధోహరిః ||

''శైవులు శివుడనీ, వేదాంతులు బ్రహ్మమనీ, బౌద్ధులు బుద్ధుడనీ, నైయాయికులు కర్తయని, జైనులు అర్హతుడనీ, మీమాంసకులు కర్మ''యని కొలుస్తున్న శ్రీహరి మీకు వాంఛి తార్థముల నిచ్చుగాక!

శ్రీ మాణిక్యవాచకర్‌ గూడా ఏమనుచున్నారో చూడండి.

''దైవవాణియు, నాల్గు వేదముల సిగయు

మువ్వురిచ్చిన తమిళమ్ము ముని వచస్సు

కమ్మకమ్మని తిరువాచక మ్మివెల్ల

స్వామి పలికిన ఒక్క వాచకము సూవె!''

కాబట్టి మతములు మార్చుకొనుటకంటే మన పెద్దల మతాన్ని త్యజించుటలోనే ఎక్కువ అపచారమున్నదని గ్రహించాలి.

పూర్వాచారాన్ని వదలుకొనుట పాతిత్యకారణమన్నారు. కొత్తమతాన్ని అవలంభించ వలసిందని కోరడంలో తాత్పర్యమేమైనా వుంటుందేమో ఆలోచించండి. పాతమతాన్ని అంత వరకు అనుసరించినవారంతా అధోగతిపాలవుతారనే కదా? అది అసంభావ్యమని వేరే చెప్పనక్కరలేదు. శైవులను వైష్ణవులుగా, వైష్ణవులను శైవులుగా మారండిఅని అనటం కూడా తప్పే. కొత్తమతాలన్నింటికి కర్తయైన పరమేశ్వరునిపట్ల అపచారమే అవుతుంది. సకల మతములవారికీ ఒక్కడేకదా ఈశ్వరుడు.

కొన్ని మతాలకు అది అంటూ వుంటుంది. అనాదియైన మతముకంటే అవి అర్వాచీనములని అంగీకరించాలి. చరిత్ర తెలిసిన మతాలకు ప్రవక్తలుంటారు. వారు పుట్టిన కాలమూ నిర్ణీతమైవున్నది. మన మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు. దానికికర్త కూడాలేడు. వేదమార్గమనిచెప్పబడే మనమతానికి ప్రచారకులంటూ లేకపోయినా, కేవలం తన్మతానుయాయుల అనుష్టానాదులవల్లనే అది సజీవంగా ఉంటున్నది. ఇతర మతస్ధులకు తన్మతప్రచారం విధాయకం. మన మతం ''నాపృష్ఠఃకస్యచిత్‌ బ్రూయాత్‌'' 'అడుగనిదే చెప్పవలదని' ఆదేశిస్తున్నది. ప్రచారము కూడదనే యిట్టి నిషేధం ఉన్నప్పటికి అసంఖ్యాకంగా ప్రజలుదీని ననుసరిస్తున్నారు. ఇతరులను తమలో కలుపుకునే అన్యమతాలు పుట్టకపూర్వం మన మతాని కింకెంత వ్యాప్తి వుండేదో!

మన మతస్థుల నితరమతాలు తమలోచేర్చుకుంటున్నా మనమతం యితరులను తనలోచేర్చుకోకపోయినా మనమతం ఇంకా బాగానే వుంటున్నదికదా! దీనికి కారణమేమిటనిఆలోచిస్తే, సదనుష్ఠానంవల్లనే మతాలు సజీవంగా ఉంటవేకాని, అన్యులకు ప్రవేశమిచ్చి మతస్థులసంఖ్యను పెంచటంవల్లకాదని స్పష్టమవుతుంది. కనుక మనమందరంసదనుష్ఠానపరులం కావలసి వుంది. దేవాలయాదులందు మన ధర్మ ప్రతిష్టాపనలపట్లమనకు శ్రద్ధ సన్నగిల్లడం శోచ్యం, శిధిలావస్థలోవున్న చర్చిగాని, మసీదుగానీ అరుదుగాకనిపిస్తవి. మరి మన జీర్ణదేవాలయాలు లెక్కకు మిక్కిలిగా కనపిస్తున్నవి. పెద్దలు విధించిన ధర్మాల నాచరిస్తూఉంటేనే ఏ మతమయినా బ్రతుకుతుంది. ఈసంసార సముద్రసంక్షోభములో నిలవద్రొక్కుకునిదీన్నిదాటవలెనంటే ఏదో మంత్రమో, జపమో, అనుష్ఠానమో మనకు ఆలంబనముగా వుండాలి. మన మతధర్మములం దేకొంచెమో మనం ఆచరిస్తూవుంటే నిషిద్ధమార్గముల పాలబడక, మనం గట్టెక్కి ఇతరులకుకూడా త్రోవచూపినవాళ్ళమవుతాము. ఎవరిధర్మం వారు ఆచరిస్తూవుంటే లోకానికి శ్రేయం లభిస్తుంది. అట్టి ధర్మాచరణం లోపించుటవల్లనే మనతోపాటు లోకంకూడా పాపపంకంలో దిగబడివున్నది. సచ్చరిత్రులేలోకానికి ఏడుగడ. లోకమనేది మనకంటె వేరుగాలేదు.

మతములన్నిటినీ ఒక అచ్చున పోయనక్కరలేదు. మనకు మతైక్యంకావాలిగానీ, ఏకమతం గాదు. అనేకత్వమం దేకత్వం దుర్లభం గాదు. ఎవరి మతములందు వారు వుండి స్వధర్మాచరణచేస్తూ, సకలమతాలకు ప్రభువైన సర్వేశ్వరుణ్ణి ఉపాసించుదుము గాక!


Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page